
పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం.పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. 'హిల్సా ఇలీషా' అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద మరియు యానాం వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.
0 Comments